గన్నవరం నియోజకవర్గం హోరెత్తిన యువగళం! యువనేతకు సంఘీభావంగా భారీగా రోడ్లపైకి జనం
నేడు నూజీవీడు అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశం
గన్నవరం: అరాచకపాలనను అంతమొందించడమే లక్ష్యంగా యువనేత Nara Lokesh చేపట్టిన యువగళం పాదయాత్ర గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో హోరెత్తుతోంది. 192వరోజు యువగళం పాదయాత్ర చినఅవుటపల్లి ఎస్ఎం కన్వెన్షన్ హాలు నుంచి ప్రారంభం కాగా, అడుగడుగునా జనం పెద్దఎత్తున రోడ్లపైకి వచ్చి యువనేతకు సంఘీభావం తెలిపారు. తొలుత క్యాంప్ సైట్ లో భవన నిర్మాణదారులు, కార్మికుల సమాఖ్య ప్రతినిధులు యువనేతను కలిసి తమ కష్టాలు చెప్పుకున్నారు. అనంతరం పార్టీ నేత యార్లగడ్డ వెంకట్రావు నేతృత్వంలో పెద్దఎత్తున వైసిపి నాయకులు, కార్యకర్తలు టిడిపిలో చేరారు. తర్వాత నిర్వహించిన గన్నవరం నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశంలో లోకేష్ మాట్లాడుతూ… నాలుగేళ్ల మూడు నెలలుగా పార్టీ కోసం కార్యకర్తలు, నాయకులు అహర్నిశలు కష్టపడ్డారు. మీ కష్టం, మీ పోరాటం వృధా కానివ్వను. వంశీ పార్టీని వదిలి వెళ్లిన తర్వాత బచ్చుల అర్జునుడు పార్టీ కోసం తన చివరి శ్వాస వరకు కష్టపడ్డారు. అర్జునుడు కుటుంబానికి అన్యాయం జరగదు. అర్జునుడు మరణించిన తర్వాత నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి దేవినేని అపర్ణ, చందూలు పాటుబడ్డారంటూ వారి సేవలను అభినందించారు. 2024 ఎన్నికలో గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం పాదయాత్ర ప్రారంభించిన లోకేష్… చినఅవుటపల్లి, ఆత్కూరు, పొట్టిపాడు మీదుగా అంపాపురం శివారు విడిది కేంద్రానికి చేరుకున్నారు. 192వరోజు యువనేత లోకేష్ 11.2 కి.మీ.ల పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 2553.5 కి.మీ.ల మేర పూర్తయింది. గురువారం నాడు యువగళం పాదయాత్ర మీర్జాపురం వద్ద నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది.
యువనేత నారా లోకేష్ సెల్ఫీ ఛాలెంజ్
*గన్నవరం ఇంఛార్జ్ గా యార్లగడ్డ వెంకట్రావు!*
*అధికారికంగా ప్రకటించిన యువనేత లోకేష్*
*తల్లిలాంటి పార్టీకి వంశీ వెన్నుపోటు పొడిచారు*
*కలసికట్టుగా గన్నవరంలో పసుపుజెండా ఎగరేయాలి*
*గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి బాధ్యత నాది*
*లోకేష్ సమక్షంలో భారీగా టిడిపిలోకి చేరికలు*
గన్నవరం: గన్నవరం ఇంఛార్జ్ గా యార్లగడ్డ వెంకట్రావును ప్రకటిస్తున్నా ఓడించడమే లక్ష్యంగా కార్యకర్తలంతా పనిచేయాలని యువనేత నారా లోకేష్ పిలుపునిచ్చారు. గన్నవరం సమీపంలోని చినఅవుటపల్లి ఎస్.ఎమ్.కన్వెన్షన్ హాలులో పలువురు వైసిపినేతలు, వారి అనుచరులతో యువనేత లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… TDP కంచుకోట గన్నవరం. ఎందరో గొప్పవ్యక్తులు ఎమ్మెల్యేలుగా గన్నవరం నుండి ఎన్నికయ్యారు. గతంలో మేము చేసిన తప్పువల్లే గన్నవరం ప్రజలు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. హేమాహేమీలను కాదని పేరు కూడా తెలియని వంశీని ఎమ్మెల్యేను చేశాం. 2019లోనూ భిన్నాభిప్రాయాలున్నా రెండోసారి వంశీని ఎమ్మెల్యేను చేశాం. ఇప్పుడు మాపై తప్పుడు ఆరోపణలు చేసే వంశీ ఆనాడు ఎందుకు బి.ఫామ్ తీసుకున్నాడు? రాజకీయాల్లో నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలి. దేవుడు అన్నిరకాల పరీక్షలు పెడతారు, వాటిని తట్టుకున్నవారే నిలబడతారు. నాపైన, పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలపై అక్రమంగా ఈ ప్రభుత్వం వచ్చాక తప్పుడు కేసులు పెట్టింది. అతనికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తా. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిన తర్వాత తల్లిలాంటి పార్టీకి వెన్నుపోటు పొడిచిన వంశీని రాజకీయంగా శాశ్వతంగా సమాధి చేయాలి, గన్నవరం గడ్డపై టిడిపి జెండా ఎగురవేయడమే లక్ష్యంగా అందరూ కలసికట్టుగా పనిచేయాలి.
అర్జునుడు కుటుంబానికి అండగా ఉంటాం
అంచలంచెలుగా అర్చునుడు పార్టీలో ఎదిగారు. అమరావతి కోసం అసెంబ్లీలో పోరాడారు. వైసీపీ మంత్రులు ఎమ్మెల్సీలకు డబ్బులిచ్చి లాగాలని చూసినా నేను పుట్టింది టీడీపీలో, చనిపోయేది కూడా టీడీపీలోనే అని అర్జునుడు అన్నారు. కౌన్సిల్ లో నాపై దాడి చేసేందుకు ఒక మంత్రి ప్రయత్నిస్తే అర్జునుడు ముందుండి పోరాడారు. వైసీపీ వచ్చాక చాలా మంది ఇబ్బంది పడి జైలుకు వెళ్లారు. మీ అందర్నీ కాపాడుకునే బాద్యత నేను తీసుకుంటా. 2019 నుండి 2024 మధ్య ఎక్కువ ప్రజా సమస్యలపై పోరాడి ఎక్కువ కేసులున్నవారికి నామినేటెడ్ పోస్టుచ్చే బాధ్యత నేను తీసుకుంటా. బచ్చుల అర్జునుడు కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటాం.
భువనేశ్వరమ్మకు కానుకగా ఇస్తాం: యార్లగడ్డ
కలసికట్టుగా పని చేసి గన్నవరంలో వంశీని ఓడిస్తాం. గన్నవరాన్ని భువనేశ్వరమ్మకు కానుకగా ఇస్తాం. నేను పెత్తనం చేయడానికి పార్టీలోకి రాలేదు, గన్నవరంలో టీడీపీ జెండా ఎగరేయడానికి వచ్చా. టీడీపీ బలోపేతానికి శక్తివంచన లేకుండా పని చేస్తానని టిడిపి నేత యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. వైసీపీలో నాతో పాటు పలువురు కార్యకర్తలకు తీరని అన్యాయం జరిగింది. నేను అధికారం కోసం టీడీపీలోకి రాలేదు, వంశీని ఓడించడమే మా లక్ష్యం. నేను నిజాయితీగానే పని చేస్తున్నా. వైసీపీ నుండి వచ్చే కార్యకర్తలు, నాయకులు ఏమీ ఆశించి రావడంలేదు. గన్నవరానికి మంచి భవిష్యత్ ఉండాలని, అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నారు. నేను ఓడిన తర్వాత 4నెలలు ఇంచార్జ్ గా ఉన్నా టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధించలేదు. దార్శనికుడు చంద్రబాబు విజన్ వల్లే ఐటీ రంగం అబివృద్ధి చెందింది. గత నాలుగేళ్లుగా గన్నవరంలో భూముల రేట్లు తగ్గిపోయాయి. గన్నవరానికి టీడీపీ ఏం చేసిందో నాకు అవగాహన ఉంది. నాతో పాటు వచ్చిన వైసీపీ నేతలతో టీడీపీ కార్యకర్తలు కలసి పనిచేస్తారు, సమస్య ఉంటే కలసి కూర్చుని మాట్లాడుకుందాం. రాబోయే తరానికి లోకేష్ దిక్సూచిగా ఉంటారు. కుప్పంను ఎలా చూస్తున్నారో గన్నవరంను కూడా చంద్రబాబు, లోకేష్ అలాగే చూడాలని యార్లగడ్డ కోరారు.
టిడిపిలో చేరిన వైసిపి నాయకులు
యువనేత లోకేష్ సమక్షంలో వైసిపి ముఖ్యనేతలు టిడిపిలో చేరారు. పసుపుకండువాలు కప్పి వారిని సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో గన్నవరం మాజీ ఎంపీపీ తుల్లిమిల్లి ఝాన్సీ, వైస్ ఎంపీపీ సుధీర్, గన్నవరం ఎంపీటీసీలు రంగారావు, మద్దినేని వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీసీటీ కోటిరెడ్డి, కో-ఆపరేటివ్ అధ్యక్షుడు గొండిశివ, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి తగరం కిరణ్, ప్రసాదంపాడు అధ్యక్షులు గూడవల్లి శ్రీనివాస్, గన్నవరం నియోజకవర్గ ప్రచారకర్త విజయారావు, రామవరప్పాడు మాజీ ఉపాధ్యక్షులు కొల్లా ఆనంద్, గన్నవరం మహిళా అధ్యక్షురాలు బాడుగ ఘాన్సీ, నియోజకవర్గ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ పరసా కిరణ్ కుమార్, కాసరనేని రంగబాబు, కోపరేటివ్ బ్యాంక్ ప్రెసిడెంట్ పద్మప్రియ, రామవర్పాడు వార్డు మెంబర్లు, కొంగన రవి, బి.సురేష్, ఆజాద్ సహా 120 మంది క్రియాశీలక నేతలు, వారి అనుచరులు టీడీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీఎంపిలు కొనకళ్ల నారాయణ, కంభంపాటి రామ్మోహన్, మాజీమంత్రులు దేవినేని ఉమా, నెట్టెం రఘురామ్, కొల్లు రవీంద్ర, టిడిపి పొలిట్ బ్యూరోడ సభ్యుడు బోండా ఉమ, బచ్చుల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
లోకేష్ తో భవన నిర్మాణదారులు, కార్మిక సమాఖ్య ప్రతినిధుల భేటీ -నిర్మాణరంగానికి గత వైభవం తెస్తామని యువనేత భరోసా
గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం చినఅవుటపల్లి ఎస్ఎం కన్వెన్షన్ హాలు వద్ద ఎపి భవన నిర్మాణదారులు, కార్మిక సమాఖ్య ప్రతినిధులు యువనేత లోకేష్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సమాఖ్య ప్రతినిధులు మాట్లాడుతూ… నిర్మాణరంగం, దాని అనుబంధ పరిశ్రమలైన స్టీలు, సిమెంటు, టైల్స్, టింబర్, వైర్లు తదితర 250రంగాలకు ఊతమిచ్చి, లక్షలాది కార్మికులకు ఉపాధి కల్పిస్తుంది. వ్యవసాయం తర్వాత అత్యధికంగా జీవనం సాగిస్తున్నది నిర్మాణరంగం పైనే. గత నాలుగేళ్లలో రాష్ట్రంలో తీవ్రంగా నష్టపోయింది నిర్మాణరంగమే. చాలామంది బిల్డర్లు, కార్మికులు, ఏజంట్లు హైదరాబాద్ వలసవెళ్లారు. ఒక్క విజయవాడ నగరం నుంచే లక్షమంది వలసబాట పట్టి నిర్మాణరంగం కుప్పకూలింది. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో పెద్దఎత్తున నిర్మాణాలు సాగడంతో హైదరాబాద్ నుంచే ఇక్కడకు కార్మికులు తరలివచ్చారు. గతంలో ఒక వెలుగు వెలిగిన నిర్మాణరంగాన్ని మీరు అధికారంలోకి వచ్చాక మళ్లీ బలోపేతం చేయండి. నిర్మాణరంగానికి పరిశ్రమ హోదా కల్పించండి. దీనిద్వారా బ్యాంకు లోన్లకు అవకాశం కలిగి ఈ రంగానికి ఊతమిస్తుంది. ఉచిత ఇసుక పాలసీ లేదా టన్ను 100 రూపాయలకు ఇచ్చేలా చర్యలు తీసుకోండి. దీనివల్ల పేద, మధ్యతరగతి వారికి వెసలుబాటు కలుగుతుంది. ఆగిపోయిన అభివృద్ధి చక్రం మళ్లీ గాడిలో పడుతుంది. భారీగా పెంచిన స్టాంపు డ్యూటీ తగ్గించండి, దీనివల్ల క్రయ,విక్రయాలు ఊపందుకొని రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం కూడా పెరుగుతుంది. రాష్ట్రంలో 40లక్షలమంది నిర్మాణ కార్మికులు ఉన్నారు. పనిచేసే సమయంలో ప్రమాదాలు సంభవిస్తే వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. రూ.10లక్షల ప్రమాద బీమా కల్పించండి. రాష్ట్రంలో 3లక్షలమంది నిరుద్యోగ యువత రియల్ ఎస్టేట్ ఏజంట్లుగా ఉపాధి పొందుతున్నారు. అసంఘటిత రంగంలో ఉన్న వీరికి రెరా ద్వారా గుర్తింపు కార్డులు ఇచ్చి, ఈఎస్ఐ, ఆరోగ్యబీమా కల్పించండి.
నారా లోకేష్ మాట్లాడుతూ…
వైసీపీ ధనదాహం 40లక్షల మంది భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడేసింది. పనులు కోల్పోయి రాష్ట్రంలో వందలాది కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు .టిడిపి అధికారంలో రాగానే మెరుగైన ఇసుక పాలసీ ద్వారా నిర్మాణరంగాన్ని మళ్లీ పట్టాలెక్కిస్తాం వైసీపీ ప్రభుత్వం నిర్మాణరంగంపై అడ్డగోలుగా పెంచిన పన్నులు తగ్గిస్తాం. అభివృద్ధి వికేంద్రీకరణ మా అజెండా, రాష్ట్రంలోని అన్ని నగరాలను అభివృద్ధిచేస్తాం. ఎక్కువమందికి ఉద్యోగాలు కల్పించే రంగాలకు రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వాలన్నది మా విధానం. నిర్మాణరంగాన్ని బలోపేతం చేయడానికి అవసరమైన అన్ని రాయితీలు కల్పిస్తాం. బిల్డింగ్ మెటీరియల్ కాస్ట్ తగ్గించేలా చర్యలు తీసుకుంటాం. కార్మిక సంక్షేమ బోర్డు ద్వారా గతంలో అమలుచేసిన సంక్షేమ కార్యక్రమాలను పునరుద్దరిస్తాం, ప్రమాదంలో మృతిచెందిన కార్మికులను చంద్రన్న బీమా ద్వారా ఆదుకుంటాం. నాలుగేళ్ల విధ్వంసక పాలనలో ఛిద్రమైన నిర్మాణరంగానికి పరిశ్రమ హోదా కల్పించి మళ్లీ గత వైభవం తెస్తాం.
నారా లోకేష్ ను కలిసిన ఆత్కూరు గ్రామస్తులు
గన్నవరం నియోజకవర్గం ఆత్కూరు కోఆపరేవటివ్ బ్యాంకు బాధితులు యువనేత నారా లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. 2022 మే నెలలో ఆత్కూరు కోపరేటివ్ బ్యాంకు ఉద్యోగులు, అధికారులు రూ.3కోట్లు గోల్ మాల్ చేశారు. నష్టపోయిన బాధితుల్లో నలుగురు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 150 కుటుంబాలు బ్యాంకు ఉద్యోగుల నిర్వాకానికి మోసపోయాయి. గ్రామస్తులు చేసిన పోరాట ఫలితంగా కోటి రూపాయలు తిరిగి రాబట్టగలిగాం. మిగిలిన డబ్బులు ఎన్ని పోరాటాలు చేసినా తిరిగి ఇవ్వడం లేదు. 2014-19 మధ్య గ్రామంలో సుమారు రూ.80కోట్ల విలువైన పనులను చేపట్టాం. గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించుకుంటే ప్రస్తుత ప్రభుత్వం సిబ్బందిని ఇవ్వడంలేదు. జిల్లా పరిషత్ హైస్కూల్ వద్ద ఇండోర్ స్టేడియం కడితే దాన్ని గోడౌన్, ప్రైవేటు కార్యక్రమాల కోసం ఎమ్మెల్యే అనుచరులు వాడుతున్నారు. ఏలూరు కాలువపై రూ.11కోట్లతో వంతెన పనులు మొదలుపెడితే ప్రస్తుత ప్రభుత్వం పనులు నిలిపేసింది. మూడు అంతస్తుల మోడల్ పోలీసు స్టేషన్ నిర్మాణం చేపడతే వైసీపీ ప్రభుత్వం పనులు మధ్యలో ఆపేసింది. గ్రామంలో 150రేషన్ కార్డులు, పెన్షన్లను వైసీపీ ప్రభుత్వం కుంటిసాకులతో రద్దుచేసింది. ఇంటి పట్టాలు ఎమ్మెల్యే అనుచరులే తీసుకున్నారు తప్ప అర్హులకు ఇవ్వలేదు. మీరు అధికారంలోకి వచ్చాక మా గ్రామ సమస్యలను పరిష్కరించాలి.
నారా లోకేష్ స్పందిస్తూ
లక్షకోట్ల ప్రజాధనాన్ని దోచేసి 16నెలలు చిప్పకూడు తిన్న గజదొంగ ప్రజల ఆస్తులకు ఎలా రక్షణకల్పిస్తారు? అధికారంలోకి వచ్చాక ఆత్కూరు కోఆపరేవటివ్ సొసైటీలో డబ్బుకొట్టేసిన దొంగలను జైలుకుపంపి, దోపిడీసొమ్ము రాబట్టి బాధితులకు న్యాయం చేస్తాం. ఆత్కూరు గ్రామంలో నిలచిపోయిన అభివృద్ధి పనులన్నీ పూర్తిచేస్తాం. వైసిపి ప్రభుత్వం అక్రమంగా తొలగించిన పెన్షన్లు, రేషన్ కార్డులను పునరుద్దరిస్తాం. ఇల్లులేని ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు నిర్మించి ఇస్తాం. గన్నవరం నియోజకర్గంలో పేట్రేగిపోతున్న అసాంఘికశక్తులపై ఉక్కుపాదం మోపుతాం.
నారా లోకేష్ ను కలిసిన ఎన్.అప్పారావుపేట గ్రామస్తులు
గన్నవరం నియోజకవర్గం పొట్టిపాడులో నారయ్య అప్పారావుపేట గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలో రోడ్లు, డ్రైనేజీలు లేవు. డ్రైనేజీ నీరు పొంగి రోడ్లపై ప్రవహిస్తోంది. వర్షాలు పడితే మా గ్రామంలో టూ వీలర్స్ తిరిగే పరిస్థితి లేదు. గ్రామంలో రోడ్లు సరిగా లేక స్కూల్ బస్సులు కూడా రావడం లేదు. త్రాగునీటి కోసం పక్క గ్రామాలకు వెళ్లాల్సిన దుస్థితి ఉంది. .మా గ్రామాన్ని ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. మీరు అధికారంలోకి వచ్చాక మా గ్రామ సమస్యల్ని పరిష్కరించండి.
నారా లోకేష్ స్పందిస్తూ
వైసీపీ అధికారంలోకి వచ్చాక గ్రామీణాభివృద్ధిని పూర్తిగా గాలికొదిలేశారు. జల్ జీవన్ మిషన్ పథకం నిధులను కేంద్రం ఇస్తే వాడుకోలేని దివాలాకోరు ప్రభుత్వమిది. టిడిపి ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 25వేల కి.మీ.ల సిసి రోడ్లు వేశాం. అధికారంలోకి వచ్చాక గ్రామసీమల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చి రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలికసదుపాయాలు కల్పిస్తాం. వాటర్ గ్రిడ్ ద్వారా ఇంటింటికీ కుళాయి అందజేసి, 24/7 స్వచ్చమైన తాగునీరు అందిస్తాం.
టీషాపు నిర్వాహకులతో యువనేత మాటామంతీ
గన్నవరం నియోజకవర్గం పాదయాత్ర చేస్తున్న యువనేత లోకేష్ తేలప్రోలులో జాతీయ రహదారి పక్కన ఓ టీకొట్టులో టీతాగి షాపు నిర్వాహకులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా టీ షాపు నిర్వాహకులు ధనరాజు, నాగమణితో మాట్లాడుతూ… పెరిగిన గ్యాస్, ముడిసరుకుల ధరలతో వ్యాపారం లాభసాటిగా లేదు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, కరెంటు ఛార్జీలతో బతుకుబండి లాగడం భారంగా ఉంది. భార్యాభర్తలం రోజంతా కష్టపడినా కుటుంబాన్ని నడపడం కష్టంగా మారింది. ధరలను అదుపుచేస్తే మాలాంటి వారికి ఉపశమనంగా ఉంటుందని ధనరాజు, నాగమణి చెప్పారు.
యువనేత లోకేష్ మాట్లాడుతూ
జగనాసురుడి పాలనలో సామాన్య ప్రజలు కడుపునిండా భోజనం, కంటినిండా నిద్రపోయే పరిస్థితులు లేవు. నాలుగేళ్లలో 9సార్లు విద్యుత్ ఛార్జీలు, 3సార్లు ఆర్టీసి చార్జీలు పెంచి సామాన్య ప్రజల నడ్డివిరిచాడు. దేశంలో ఎక్కడా లేనివిధంగా అత్యధికంగా పెట్రోలు, డీజిల్ ధరలు ఎపిలో మాత్రమే ఉన్నాయి. పేదల కష్టం తెలుసుకున్నాకే చంద్రబాబునాయుడు ప్రతిఏటా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించారు. మహాశక్తిలో భాగంగా ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెల రూ.1500 రూపాయలు ఉచితంగా ఇవ్వబోతున్నారు. రాబోయే చంద్రన్న ప్రభుత్వం ధరలను అదుపుచేసి అన్నివర్గాల ప్రజలకు అండగా నిలుస్తుంది.
Also Read This Blog :Stride by Stride: Unveiling the Journey of Yuvagalam Padayatra
Tagged:#LokeshPadaYatra#Padayatra#YuvaGalamLokesh#YuvaGalam#NaraLokeshPadaYatra#NaraLokesh